"స్వచ్ఛ భారత్ స్ఫూర్తి ప్రదాత"

"నేటి నిఘా న్యూస్ స్పెషల్ స్టోరీ"
"స్వచ్ఛభారత్ స్ఫూర్తి ప్రదాత"

 "ప్రజా చైతన్య ఉద్యమకారులు"
"సంత్ గాడ్గేబాబా మహారాజ్" 146 వ ఆత్మగౌరవ జయంతి శుభాకాంక్షలు.....

వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం
నిజామాబాద్ జిల్లా సీనియర్ న్యాయవాది ఎడ్ల రాములు (రాహుల్) 
న్యూస్ లైన్ ప్రతినిధి.
మహనీయుల మాటలు కు  బాటలు వేస్తూ మేము సైతం అంటూ మానవత్వానికి మారుపేరు గా నిలిచిన మహనీయులు
శ్రీ సంత్ గాడ్గే బాబా
 (ఫిబ్రవరి 23 1876)......... డబ్బులు లేకపోతే తినే గిన్నెలయినా అమ్ముకోండి! చౌకబారు దుస్తులు కొనుక్కోండి, పూరిగుడిసెలో నైనా జీవించండి, కానీ,మీ పిల్లలకు తప్పనిసరిగా విద్యను అందించండి. మాటలు విన్న వారికి ఎవరికైనా విద్య యొక్క గొప్పతనం అర్థమవుతుంది. తాను చదువుకోలేకపోయానని ఆయన ఎంతో బాధపడేవారు. మన బహుజన సమాజం అభివృద్ధి సాధించాలంటే, విద్యని అభ్యసించాలని ఆయన హితవు పలికారు. ఈ మాటలన్నది ఎవరో కాదు సంత్ గాడ్గే బాబా. ఈ రోజు వారి జయంతి. సంత్ గాడ్గే బాబా జయంతి సందర్భంగా.*

*సంత్ గాడ్గే బాబా మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ఖాస్పూర్.. నేటి షేన్ గాం గ్రామంలో జింగ్రాజి సక్కుబాయి లకు 23 ఫిబ్రవరి 1876 న జన్మించారు. ఆయన చిన్ననాటి పేరు డేబూ జీ. ఆయన తండ్రి గారైన జింగ్రాజీ పరిత్ కులానికి (ధోభీ, అంటే చాకలి లేదా రజక) సామాజిక వర్గానికి చెందినవారు. ఈ దోబి కులం భారతదేశంలో 50 శాతం ప్రాంతాల్లో అంటరాని లేదా షెడ్యూల్డ్ కులాల జాబితాలో పరిగణిస్తారు.. మరొక 50 శాతం ప్రాంతాల్లో వెనుకబడిన తరగతుల్లో బీసీలుగా పరిగణిస్తున్నారు జింగ్రాజీకి మద్యం సేవించడం వ్యసనంగా ఉండేది. అందువల్ల మద్యం సేవించడం కోసం ఆస్తులన్నీ కరగ పెట్టారు. ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. జింగ్రాజి చిన్నమ్మ కొడుకులు వరుసకు తమ్ముళ్ళు అయిన యాదవ్ మరియు జైరాం లు జాలిపడి కుటుంబం మొత్తాన్ని వారి ఇంటికి తీసుకెళ్లారు. డేబు తండ్రి జింగ్ రాజి కొన్ని రోజులకు అక్కడే మరణించారు.*

 *డేబు జీ తాతగారైన హంబీర్ రావు జీ తన కూతురు సక్కుబాయి మరియు డేబు జీ లను వారి తల్లిగారైన దాపూరే  గ్రామం తీసుకువెళ్లారు. అప్పటికి ఆయన వయసు ఆరు లేదా ఏడు సంవత్సరాలు ఉంటుంది. వాస్తవానికి అది చదువుకునే వయసు కానీ, అప్పటి సామాజిక పరిస్థితులలో అంటరాని మరియు వెనుకబడిన శూద్ర కులాలు విద్యకు అనుమతి లేనందున వీరు విద్యను అభ్యసించే లేకపోయారు. వారి మేనమామ అయిన చంద్రభాన్ గారు పశువులను కాచే పనిని డేబు జీ కి అప్పజెప్పారు. డేబు జీ పశువులు కాసే పిల్లలతో ఒక జట్టు తయారు చేసుకున్నారు. వారు ఈ సమయంలో ఈత కొట్టడం, ఆటలు ఆడడం, పాటలు పాడటం చేసేవారు. చిన్నప్పటినుండి డేబు జీ కి సంగీతం అంటే చాలా ఇష్టం. అందుబాటులో ఉన్న రేకు డబ్బా లాంటి వస్తువులతో డేబు జీ సంగీతం వాయించేవారు. వారి గ్రామంలో తరచుగా ధార్మిక మేళాలు నిర్వహించబడుతూ ఉండేవి. వీటిల్లో పాటలు బాగా పాడే డేబు జీ కి తరచూ అవకాశం లభిస్తుండేది.  ఇవి ఒక్కోసారి వారం రోజుల పాటు కొనసాగుతూ ఉండేది. డేబు జీ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వారి తల్లి గారికి మామకు అస్సలు ఇష్టం లేదు. కానీ డేబు జీ కి  ఈ కార్యక్రమాల అనంతరం జరిగే భోజన కార్యక్రమాలు బాగా ఆకర్షించింది. ఈ భోజన కార్యక్రమాలలో పేదవారికి ఆకలిదప్పులతో అలమటించే వారికి స్థానం దక్కకపోయేది. ఆకలిదప్పులతో ఉన్నవారికి ఆకలిని తీర్చడమే ఆయన పూజ గా భావించేవారు.*
 *డేబు జీ దృష్టి మరల్చడానికి వారి మేనమామ మరికొంత వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి ఆ బంజరు భూములను సాగు భూములుగా తీర్చిదిద్దే బాధ్యతను డేబు జీ కి అప్పజెప్పారు. గాడ్గే బాబా మొదటి నుండి శ్రమైక జీవన ఇష్టపడేవారు. ఏ పనిని చిన్నదిగా భావించేవారు కాదు. కష్టపడడం లో ఏమిటి తప్పు అని అంటూ ఉండేవారు. మొదటినుంచి చదువుకోక పోయినా ఆయన ఎంతో పరిణతితో కూడిన ఆలోచన చేసేవారు. అభ్యుదయ భావాలు కలిగిన వారు. బంజర భూముల్ని సాగు భూములుగా మార్చారు. అప్పట్లో షావుకారు వ్యవస్థ కూడా ఉండేది. ఈ షావుకార్లు రైతులకు రుణాలిచ్చి అత్యధికంగా వడ్డీలు వసూలు చేసేవారు. ఈ క్రమంలో గాడ్గే గారి మేనమామ షావుకారు గారికి చాలా అప్పు పడ్డారు. వారి మేనమామ ని షావుకారు కబంధహస్తాల నుంచి విముక్తిని చేయాలని గాడ్గే బాబా నిత్యం పరితపించే వారు. షావుకార్లు కు రుణపడి ఉండటం అంటే అది రైతు వినాశనమే అని అర్థం చేసుకున్నారు. ఒకసారి ఆ షావుకారు అప్పు తీర్చలేదని తన మేనమామ పొలాన్ని ఆక్రమించుకోవడానికి వస్తే గాడ్గే బాబా ఎదిరించాడు. తన ధిక్కార స్వరాన్ని వినిపించారు. జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టాడు... తప్పనిసరి పరిస్థితుల్లో భుజబలం చూపించి వచ్చిన వారిని పొలాల నుంచి తన్ని తరిమారు. దీనివల్ల వారి కుటుంబానికి మేలే జరిగింది. ఆ తర్వాత మరెన్నడూ షావుకారు వారిని బాధించలేదు.*

 *సమాజంలోని అసమానతలు, అమానవీయమైన చర్యలు, అన్యాయం ఆయనకు నచ్చేవి కావు. క్రమంగా గ్రామంలో జరుగుతున్న ధార్మిక మేళాలు, సాంస్కృతిక కార్యక్రమాలలో గాడ్గే బాబా కీ చాలా గుర్తింపు వచ్చింది. అనంతరం జరిగే భోజన కార్యక్రమాలలో మీరు పేదవారిని కూడా చేర్చుకోవాలని గ్రామస్తులకు నచ్చజెప్పారు. లేనిపక్షంలో తను వారితో కలిసి పనిచేసే అవసరం ఉండబోదని హెచ్చరించారు. అలా.. ఆ గ్రామంలో సహపంక్తి భోజనాలకి ఆయన ఆద్యులు అయ్యారు. ఈ సహపంక్తి భోజనాల వల్ల ఆయన గ్రామంలో సోదరభావాన్ని పెంపొందించారు.*

 *వారి మేనమామ కి గాడ్గే బాబా కి పెళ్లి చేయాలనే ఆలోచన పడింది. గాడ్గే బాబా పేరుమీద ఎలాంటి ఆస్తిపాస్తులు లేనందున అంత సులువుగా సంబంధాలు కుదిరేవి కాదు. అయినప్పటికీ, సమీప గ్రామం ధోభీ సామాజిక వర్గానికి చెందిన కమాల్ పూర్ వాసి ధనాజీ కల్లార్కర్ తన కూతురు కుంతా భాయినిచ్చి వివాహం చేశారు. ఆయనది కూడా రజక సామాజిక వర్గం. గాడ్గేబాబా సంత్ రవిదాస్, సంత్ కబీర్, చొక్కామేళ, సంత్ తుకారాం బోధనలతో ప్రేరణ పొంది ఉన్నారు. వీరు మొదటి నుండి మూఢాచారాలను, అర్థంలేని సాంప్రదాయాలను వ్యతిరేకించేవారు. ఈ క్రమంలో గాడ్గే బాబా కి కూతురు జన్మించింది. బారసాల కార్యక్రమంలో మద్యం మాంసానికి బదులుగా పూరి, కూరగాయలతో కూడిన భోజనం మరియు మిఠాయిలు పంచారు. ఇదేమిటని అడిగిన బంధువులకి మద్యం తాగించడం మాంసం తినిపించడం అర్థంలేని ఆచారాలు. ఇవి ఆర్థికంగా బలహీనమైన కులాలను మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తాయని తెలియజెప్పారు. పండుగల కోసం, కార్యాల కోసం అప్పు చేసి మద్యం మాంసం వడ్డించడం క్షమించరాని నేరం గా వివరించారు. వారి తండ్రిగారు తాగుడుకు బానిసై వారిని ఈరోజు బజారున పడేసిన ఉదాహరణని వారికి అర్థమయ్యేలా చెప్పారు. ఆయన తర్వాత చాలామంది వారి కులం లో మద్యాన్ని మాంసాన్ని దూరం పెట్టడం గమనిస్తే, వారి మాటలు సమాజం పైన ఎంతటి ప్రభావాన్ని చూపెవో మనకు ఇట్టే అర్థమవుతుంది. వారెప్పుడూ అవసరం ఉన్నవారికి సహాయం చేయడం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం.. మూఢనమ్మకాలను అంధ విశ్వాసాలను ప్రజల మనసులోంచి పారదోలడం నిత్యకృత్యంగా ఉండేది. ఈ మూఢ విశ్వాసాలను, ప్రజలను దోచుకునే కుయుక్తులను సమాజం నుండి శాశ్వతంగా పారద్రోలాలని తపన పడేవారు. వారికి ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు కలిగారు.*

 *ఇలా ఉండగా.. ఒకరోజు ఒక సాధువు (బౌద్ధ బిక్షువు) వారి గ్రామానికి రావడం జరిగింది. వారి బోధనలకు ప్రభావితమైన గాడ్గే బాబా వారితోనే రోజంతా గడపడం, భోజనం చేయడం, ఆలోచనలు పంచుకోవడం, సందేహాలపై చర్చించడం , కలిసి ఒక చోటే నిద్రించడం జరిగింది. ఉదయం లేచి చూస్తే ఆ సాధువు కనపడలేదు. నిరాశకు లోనైన గాడ్గే బాబా ఆలోచనలో పడ్డారు.  ఆరోజు ఫిబ్రవరి 7 ,1905 న ఆయన కొత్త వస్త్రాలు వదిలేసి పాత వస్త్రాలు ధరించి, ఒక మట్టి చిప్ప మరియు చీపురు తీసుకుని ఇల్లు వదిలేసి, తనకు బోధ పడ్డ సామాజిక సంస్కరణకు గౌతమ బుద్ధుని వలె బయలుదేరారు.* 

*ఈయన ప్రతిరోజు ఒక ఊరికి వెళ్లడం, అక్కడి పనివాళ్ళ తో పని చేయడం, వచ్చిన డబ్బుని అవసరం ఉన్నవారికి సహాయం చేయడం, ఆకలేస్తే భోజనం చేయడం లేదంటే పస్తులు ఉండేవారు. తర్వాత గ్రామంలో వీధులు, వాకిళ్లు, మురికి కాలువలు, అంతా శుభ్రంగా చేసి ఆ గ్రామ ప్రజలకు మీ గ్రామం శుభ్రంగా చేయబడ్డది అని శుభాకాంక్షలు తెలియజేసేవారు. సాయంత్రం కీర్తనల కార్యక్రమం పెట్టి, కీర్తనల ద్వారా ఆ గ్రామ ప్రజలకు జ్ఞాన బోధ చేసేవారు. ఆయన కీర్తనలలో ఎక్కువగా బుద్ధుని తాత్వికత తో కూడుకున్న సంత్ కబీర్ బోధనలని ప్రజలకు వినిపించేవారు. రోజంతా చీపురుతో వీధులన్నీ ఊడ్చేవారు... సాయంత్రం తన కీర్తనలతో ప్రజల మనసులో ఉన్న మలినాన్ని ఊడిచేవారు. మీరు ఎవరని అడిగితే, చిరునవ్వుతో నమస్కరించి వెళ్లి పోయేవారు. ఎక్కడ కూడా ఒకరోజు కంటే ఎక్కువగా ఉండేవారు కాదు. నిత్యం భ్రమిస్తూ.. శ్రమిస్తూనే ఉండేవారు. పూజాపునస్కారాలు, విగ్రహాలు, మందిరాల్లో కాదు... ప్రజాసేవే అసలైన ధర్మమని చెప్పేవారు. ఆయన ఎప్పుడూ సాధువు సంతు ఇలాంటి బిరుదులను కానీ విశేషణాలు గానీ అంగీకరించలేదు. భిక్షాటన. చేయలేదు. అయినప్పటికీ ప్రజలు వారిని సంత్ గాడ్గే బాబా గా పిలుచుకునే వారు. ఎక్కడైనా ధార్మిక మేళాలు జరిగితే, ఆయన అక్కడికి చేరుకుని చీపురుతో అక్కడ ఎలాంటి చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేసేవారు. చూసే ప్రజలకి గుడిలో ఉన్న విగ్రహం గొప్పదా? లేక బయట చీపురుతో శుభ్రం చేస్తున్న వ్యక్తి గొప్పవాడా? అని ఆలోచనలో పడేవారు. ఎందుకంటే, సాధుసంతులు ఎవరు ఈ పనికి పూనుకోరు.. మరి పిచ్చివారేమో ఈ పని అస్సలు చేయరు. అక్కడి ప్రజలతో గాడ్గే బాబా సాటివారికి సాయం చేయండి, ఆకలిదప్పులతో ఉన్నవారికి అన్నం పెట్టమని చెప్పేవారు. క్రమ క్రమంగా వీరి బోధనలతో కి ఆదరణ, విరాళాలు పెరుగుతూ వచ్చాయి. అప్పుడు గుర్తించిన తన ధోభీ కులం ఆయనని 'మా వాడు' అని చెప్పుకుని గర్వపడేది. నిజానికి ఆయన అప్పటికే జాతి వివక్ష నుంచి, కుల వ్యవస్థ నుంచి సమాజాన్ని బయట పడేసేపని చేస్తున్నారని వారు గమనించుకో లేకపోయారు. వారి కులాన్ని వారు అప్పటికే వదులుకున్నారు.*

 *సందర్శకులతో, ప్రజలతో.. అప్పులు చేసి పండుగలు, క్రతువులు చేయడం... తర్వాత అప్పుల్లో కూరుకుపోవడం మహా పాపమని హితబోధ చేసేవారు. తన కీర్తనలతో నిరాడంబరమైన జీవితాన్ని బోధించేవారు. మనుషులతో పాటు పశువులు కూడా ఆకలితో అలమటించడం చూసి ఆయన బాధ పడేవారు. ఈయన అంటరానివారి కోసం, వెనుకబడ్డ వారికోసం, మహిళల కోసం జంతువుల కోసం కూడా ఎన్నో ధర్మశాలలు నిర్మించారు. ఈ ధర్మ శాల లో ఆయన స్వయంగా శ్రమదానం చేసేవారు, తోటి వారిని కూడా శ్రమదానం చేయమని హితవు పలికేవారు. దీనివల్ల వారికి సమాజానికి మధ్య ఒక బంధం ఏర్పడుతుందని వారు తెలియజెప్పేవారు.* 

*ఈయన కేవలం మహారాష్ట్ర లోనే కాకుండా లో బయట కూడా పర్యటించి జ్ఞాన బోధ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఈయనని 'వట్టి సాధు', 'డేబూజీ బువా' అని.. మన దక్షిణ ప్రాంతంలో "గోధడేమహారాజ్" అని పిలిచేవారు. ఈయన తన బోధనల ద్వారా పండుగలు చేసుకోవడం, ముడుపులు సమర్పించుకోవడం, మొక్కులు తీర్చుకోవడం వంటి అంశాలపై వ్యంగ్యంగా విమర్శిస్తూ, హేతుబద్ధంగా ప్రజలకు జ్ఞాన బోధ చేసి చైతన్యవంతులను చేసేవారు. వీటితోపాటు భూతవైద్యం, మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు పై కూడా విమర్శిస్తూ హితబోధ చేసేవారు.*

 *ఈయన తన సమకాలీన సంఘసంస్కర్తలు మహా పురుషులతో మహనీయుల తో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అవతార్ మెహర్ బాబా, బి ఆర్ అంబేద్కర్ వీరిలో ముఖ్యులు. అవతార్ బాబా తో సంత్ గాడ్గే బాబా ఉన్నప్పుడు గాడ్గేబాబా ని చూడడానికి వేలాదిగా జనం వచ్చేవారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి సంత్ గాడ్గేబాబా ఒక ధర్మశాల ని దానం చేశారు. ఆ పిమ్మట అంబేద్కర్ గారు ఆ ధర్మశాలని ఒక గ్రంథాలయంగా, మరియు ఒక స్కూల్ గా మార్చి వేశారు. అంబేద్కర్ గారి సాహిత్యం పట్ల, వారి ఆలోచనల పట్ల ఎంతో గౌరవం తో కూడుకున్న అభిప్రాయాన్ని ఏర్పరిచింది. అంబేద్కర్ గారి సలహా మేరకు వారి ధర్మశాలలు తర్వాతి క్రమంలో హాస్టల్ గా, విద్యాలయాలుగా మార్చి వేశారు. అంబేద్కర్ గారిని ఆయన ఎంతగానో అభిమానించే వారు అంటే.. ఒకసారి ముంబైలో జరుగుతున్న కీర్తన కార్యక్రమంలో ప్రజల నుంచి ఒకరు మీరు దేవుణ్ణి నమ్ముతారా? దేవుని పట్ల మీ అభిప్రాయం ఏమిటి? అని అడిగితే.. 'నీ సమస్యల నుంచి నీ బాధలనుండి విముక్తి చేసే వ్యక్తే దేవుడు. ఉదాహరణకి అదిగో మిమ్మల్ని విముక్తి చేయబోయే ఆ అంబేద్కర్ దేవుడు అని అన్నారు. సంత్ గాడ్గే బాబా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మెచ్చుకుంటూ ఇదిగో ఇతనే మిమ్ముల్ని బానిస సంకెళ్ళ నుండి విముక్తి చేయడం కోసం మీకు రాజ్యాంగం రాశాడు చూడండి అని చెప్పేవారు. ఆయన ఆలోచన బుద్ధుని ఆలోచన.*

*ఛత్తీస్ ఘడ్ లో పర్యటించి కొంతకాలం తర్వాత ముంబైలోని బాంద్రా ప్రాంతంలో తన కీర్తన కార్యక్రమానికి హాజరై నవంబర్ 8, 1956 న చివరికి తను చేసి ముంబై నుండి బడ్నేరా తిరుగు ప్రయాణం అయ్యారు. తర్వాత అక్కడినుంచి అమరావతి... అమరావతి నుండి నాగర్ వాడి 'పేడి' నది మీదుగా వెళుతున్న క్రమంలో అంబేద్కర్ గారు చనిపోయారని విషయం తెలుసుకొని ఎంతో కుమిలిపోయారు. ఆ తర్వాత ఆయన ప్రయాణిస్తూ, అంబేద్కర్ గారు చనిపోయారని రోదిస్తూ.. డిసెంబర్ 20, 1956 న చనిపోయిన విషయాన్ని ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి కార్యక్రమం ద్వారా తెలుసుకుని ఈ దేశ ప్రజలు ఎంతో దిగ్భ్రాంతికి బాధకు లోనయ్యారు.* 

*మహారాష్ట్ర ప్రభుత్వం నాగపూర్ యూనివర్సిటీ కొంత భాగాన్ని సంత్ గాడ్గే బాబా యూనివర్సిటీ గా పేరు మార్చి నిర్ణయం తీసుకుంది.2000 సంవత్సరాల్లో భారత ప్రభుత్వం ఆయన పేరుమీద ఒక తపాలా బిళ్ళను కూడా విడుదల చేసింది. మహారాష్ట్రలో 'బాబా గ్రామ స్వచ్ఛతా అభియాన్' పేర 2001 నుండి ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ పథకం కింద సుమారుగా ఏడు కోట్ల రూపాయలు ఆ ఎన్నికైన గ్రామానికి స్వచ్ఛతా పనులకు కేటాయిస్తుంది. దాదాపు వందేళ్ల క్రితమే స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్మించిన ఈ మహనీయుని జీవితాన్ని, పోరాటాన్ని, ఆలోచనని, ఆశయాన్ని... ఈ సమాజానికి పరిచయం చేసే బాధ్యత మనదే.* మీ ఎడ్ల రాములు న్యాయవాది,
నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం.


*జై భీమ్! నమో బుద్దాయ్*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
     
     Yedla Ramu(Rahul)
                          Advocate
నేటి నిఘా న్యూస్ మీడియా
నేటి నిఘా న్యూస్ స్పెషల్ స్టోరీ
మీ చుట్టూ జరిగే అవినీతి అక్రమాల పై నిఘా వేసి సమాచార ఇవ్వండి 7097988840.
ఎడిటర్ కట్టా నరేశ్ కుమార్ నాయక్ ✍️ జర్నలిస్ట్

Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026