*మార్చ్ 10న సదస్సు*
*ఫాసిజం - ప్రమాదంలో భారతదేశం' సదస్సును జయప్రదం చేయండి.*
నేటి నిఘా న్యూస్:
భారత విప్లవ పోరాట యోధుడు కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ 7వ వర్ధంతి సందర్భంగా ఫాసిజం-ప్రమాదంలో భారతదేశం అంశంపై ఈనెల 10న హైదరాబాదులో జరిగే సదస్సు పోస్టర్లను పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ఎన్.ఆర్ భవన్, కోటగల్లీలో ఆవిష్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ దేశంలో ఒక ప్రక్క నిరుద్యోగం, పేదరికం, అసమానతలతోపాటు, సకల రంగాలలో సంక్షోభాలు ఎదురవుతున్నాయన్నారు. మరోప్రక్క మత ఉన్మాదం, మత విద్వేషం కట్టలు తెంచుకుని ప్రజల మీద స్వైర విహారం చేస్తున్నదన్నారు. ప్రగతి నిరోధక, సంకుచిత భావజాలం మనుషులను ఉన్మాదులుగా మార్చుతున్నదన్నారు. తిండి మీద, కట్టుబాట్ల మీద, స్వేచ్ఛా హక్కుల మీద, భావ ప్రకటనల మీద ఆంక్షలు, నిషేదాజ్ఞులను విధిస్తున్నదన్నారు. మొత్తంగా స్వాతంత్రోద్యమం రూపొందించుకున్న రాజ్యాంగాన్నే ధ్వంసంచేసి, మనువాద రాజ్యాంగ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. విద్య, సంస్కృతి, చరిత్ర, వివిధ పౌర ప్రజాస్వామిక సంస్థలనూ, వ్యవస్థలనూ మొత్తం కాషాయీకరించి జర్మనీ తరహా నాజీయిజంను దేశంలో తీసుకవచ్చే యత్నాలు వేగంగా జరుగుతున్నాయన్నారు. పత్రికా వ్యవస్థ, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాల నుంచి న్యాయ వ్యవస్థ దాకా వున్న కనీస ప్రజాస్వామిక పిల్లర్లను ఆక్రమించుకుని దేశాన్ని ఉన్మాదపూరితంగా మారుస్తున్నదన్నారు. ఆదానీ, అంబానీ లాంటి కొద్ది మంది కుబేరుల, అమెరికా లాంటి సామ్రాజ్యవాదుల బడా పెట్టుబడి, ఫైనాన్స్ క్యాపిటల్తో మోడీ, షాల పాలన దేశంలో ఫాసిజానికి బాటలు పరిచిందన్నారు.
ఈ స్థితిలో ఫాసిస్టు వ్యతిరేక పోరాటం ప్రతీ ప్రజాస్వామికవాది, లౌకికవాది, కమ్యూనిస్టుల కర్తవ్యం కావాలన్నారు. యూరోప్లో తలెత్తిన ఫాసిజం పరిణామ క్రమం నుంచి నేటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోడీ, అమితాల ఫాసిజం వరకు వివరంగా అర్థం చేసుకోవడానికి కామ్రేడ్ రవన్న 7వ వర్ధంతి సందర్భంగా ఈనెల 10న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రసంగ పాఠాలు ఏర్పాటు చేసామన్నారు.
దేశ భక్తియుత శక్తులతో, ప్రజాస్వామికవాదులతో ఫాసిస్టు వ్యతిరేక పోరాట కర్తవ్యాలను నిర్దేశించుకుని ఐక్య పోరాటాలు నిర్మిద్దామన్నారు. ఆ లక్ష్యసాధనలో భాగంగా ఈ సెమినార్ను నిర్వహిస్తున్నామని, జయప్రదం చేయాల్సిందిగా ప్రజలు ప్రజాస్వామికశక్తులను కోరుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్, ఐ.ఎఫ్.టి.యు జిల్లా నాయకులు విటల్, కిరణ్, పి.డి.ఎస్.యు నగర ఉపాధ్యక్షుడు మహిపాల్ పాల్గొన్నారు
Comments
Post a Comment