"భగత్ సింగ్ జయంతి "వీరుడు విప్లవ యోధుడు
*దేశానికి నేడు కావాల్సింది..*
*షహీద్ భగత్ సింగ్ వారసత్వమే!*
‘‘భారత దేశం పరిస్థితి నేడు దయనీయంగా మారింది. ఒక మతం వారు ఇతర మతం వారిని బద్ద శత్రువులుగా చూస్తున్నారు. నేడు దేశ భవిష్యత్తు చీకటిగా కనిపిస్తోంది. ఈ మత రాజకీయాలు భారతదేశాన్ని దెబ్బతీశాయి. ప్రపంచ వేదికపై భారతదేశానికి సిగ్గుచేటుగా పరిణమించాయి. సామాన్య ప్రజలపై సాగుతున్న దారుణాల నుండి రాజకీయ ప్రయోజనాలను పొందేందుకే నాయకులు ప్రయత్నిస్తున్నారు." నేటి దేశ పరిస్థితిని వర్ణించడానికి సరిపోయే మాటలు ఇవి. అయితే ఈ మాటలు నేటివి కావు. నేటికి 96 సంవత్సరాల క్రితం 1927 లో.. పంజాబ్ నుండి విలువడే కీర్తి అనే పత్రికలో ప్రచురించబడిన "మత ఘర్షణలు, వాటి నివారణ" వ్యాసం లోని మాటలు ఇవి. ఆ వ్యాసరచయిత పేరు షహీద్ భగత్ సింగ్! విప్లవ వీరుడిగా.. చిరుప్రాయంలోనే దేశ స్వాతంత్ర్యం కొరకు ఉరికంబ మెక్కిన త్యాగధనుడుగా.. మనందరికీ తెలిసిన షహీద్ భగత్ సింగ్, మతోన్మాద రాజకీయాలను సమూలంగా వ్యతిరేకించాడన్న వాస్తవం నేడు చాలా మందికి తెలియదు. నేడు షహీద్ భగత్ సింగ్ 116వ జయంతి సందర్భంగా.. ఆ అమర వీరుడి స్మృతికి నివాళి అర్పిస్తూనే.. ఆ యోధుడు మనకందించిపోయిన పోరాట వారసత్వాన్ని స్వీకరించి, నేడు దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు వెతకాల్సిన బాధ్యత నేటి తరంపై నున్నది.
బ్రిటీష్ సామ్రాజ్యవాద దాస్య శృంఖలాల నుండి భారతదేశాన్ని విముక్తం చేయడానికై 23 ఏళ్ల చిరు ప్రాయంలోనే ప్రాణార్పణ గావించిన అమరవీరుడు షహీద్ భగత్ సింగ్. 1931, మార్చి 23న నాటి బ్రిటీష్ పాలకులు భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లను లాహోర్ జైలులో ఉరితీశారు. పరాయి పాలకులను దేశం నుండి తరిమికొట్టాలనే ఆకాంక్షతోనే ఆగిపోకుండా.. స్వతంత్ర భారతదేశంలో ఎలాంటి విధానాలు అవలంబిస్తే ప్రజలకు మేలు కలుగుతుందనే విషయంలోనూ సమగ్ర దృక్పథం కలిగిన కొద్దిమంది స్వాతంత్య్ర ఉద్యమకారుల్లో భగత్సింగ్ ఒకడు.
28 సెప్టెంబర్, 1907న నేటి పాకిస్థాన్ లోని ఫైసలాబాద్ జిల్లా, బంగా గ్రామంలో భగత్ సింగ్ జన్మించాడు. యుక్త వయస్సులోనే స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 'పంజాబ్ కేసరి' లాలా లజపతిరాయ్ నాయకత్వంలో నాడు ఉధృతంగా కొనసాగుతున్న విప్లవకర ఉద్యమాల్లో భగత్సింగ్ చురుగ్గా పాల్గొన్నాడు. నాటి యువతను ఉత్తేజపరిచిన నౌజవాన్ భారత్ సభ, హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ కార్యక్రమాల్లో భగత్ సింగ్ కీలకపాత్ర పోషించాడు. 1928లో సైమన్ కమిషన్ రాకను నిరసిస్తూ లాలా లజపతిరాయ్ నాయకత్వంలో పెద్దయెత్తున ధర్నాలు, హర్తాళ్లూ కొనసాగాయి. లాహోరులో జరిగిన నిరసన ప్రదర్శనపై విరుచుకుపడిన బ్రిటీష్ పోలీసులు లజపతిరాయ్ ను లాఠీలతో తీవ్రంగా గాయపరిచారు. నవంబర్ 17న లజపతిరాయ్ ఆస్పత్రిలో కన్నుమూశాడు. తమ గురువుగారి హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతినబూనిన భగత్సింగ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్ లు నెలతిరక్కుండానే బ్రిటీష్ పోలీసు అధికారి జాన్ సాండర్స్ ను లాహోర్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే కాల్చి చంపారు. దేశ ప్రజల్లో విప్లవభావాలు మరింతగా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో.. 1929 ఏప్రిల్ 8న భగత్సింగ్ బటకేశ్వరదత్తులు ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు పేల్చారు. ప్రాణ నష్టం జరగని రీతిలో బాంబులు వేసి, నినాదాలిస్తూ, కరపత్రాలు పంచుతూ అక్కడే నిల్చుండి అరెస్టయ్యారు. అసెంబ్లీపై బాంబు దాడికేసుతో పాటు, సాండర్స్ హత్యకేసును తిరగదోడిన బ్రిటీష్ ప్రభుత్వం భగత్సింగ్, రాజ్గురు,సుఖదేవ్ లకు ఉరిశిక్షవేసింది.
గాంధేయ మార్గానికి భిన్నంగా విప్లవకార్యాచరణ ద్వారా దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది వీరపుత్రులు ఉద్యమించారు. స్వాతంత్ర్య పోరాట చరిత్రలో వీరు నెరపిన పోరాటం కూడా సముజ్వల ఘట్టంగా నిలిచిపోయింది. ఈ తరహా విప్లవవీరుల్లో షహీద్ భగత్ సింగ్ ది విశిష్టస్థానం. దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం సాధించడంతోనే ఆగిపోకుండా, స్వతంత్ర భారతానికి ఆర్థిక స్వాతంత్ర్యం కూడా సిద్ధించాలని, సామాన్యుడి సంక్షేమం సాకారం కావాలంటే దేశం సామ్యవాద పంథాను అనుసరించాలనే సమగ్ర రాజకీయ దృక్పథంతో ఉద్యమించిన వీరుడు భగత్సింగ్.
పద్దెనిమిదేళ్ల చిరుప్రాయానికే వివిధ రాజకీయ విధానాలకు సంబంధించిన అధ్యయనంలో భగత్ మునిగిపోయాడు. సింక్లేర్, విక్టర్ హ్యూగో, దాస్తోవస్కీ, బుకారిన్, మార్క్స్, లెనిన్ రచనలను విస్తారంగా చదివాడు. ఈ విస్తృత అధ్యయనం వెలుగులో.. ప్రజాస్వామ్యం, హేతువాదం, సామ్యవాద వ్యవస్థ సాధన కోసం తన రాజకీయ కార్యాచరణ కొనసాగాలని నిర్దేశించుకున్నాడు. 'ఒక మనిషిని మరొక మనిషి, ఒక జాతిని వేరొక జాతి.. పీడించే సాంఘిక ధర్మాని' కి ముగింపు పలకడమే తన రాజకీయ లక్ష్యంగా భగత్ సింగ్ ప్రకటించాడు. తెల్లవాడిని తరిమికొట్టి నల్లవాడికి అధికారం కట్టబెట్టడమే, స్వాతంత్ర్య పోరాట ఉద్దేశం కాదని భగత్సింగ్ తెగేసి చెప్పాడు. అన్ని రకాల పీడనలకు అంతం పలికినప్పుడే భరతమాతకు నిజమైన స్వేచ్ఛ లభిస్తుందని భగత్ గాఢంగా విశ్వసించాడు. నాడు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాంప్రసాద్ బిస్మిల్ మొదలగు విప్లవకారుల వేదికగా హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ కొనసాగేది. భగత్ సింగ్ చొరవతో సామ్యవాద స్థాపన సంస్థ లక్ష్యాల్లో చేరి, సంస్ధ పేరు హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ గా మారింది. 'వందేమాతరం' నాటివరకు విప్లవకారుల రణన్నినాదంగా ఉండేది. భగత్ సింగ్ రాకతో 'ఇంక్విలాబ్ జిందాబాద్' తోడయ్యింది. భవిష్యత్తు భారతం ఎలా ఉండాలనే అంశంపై స్పష్టమైన దృక్పథం కల విప్లవకారుడు షహీద్ భగత్సింగ్. పల్లెల్లోని రైతులను, ఫ్యాక్టరీల్లోని కార్మికులను చైతన్యపరచినప్పుడే దేశంలో సమసమాజం సిద్ధిస్తుందని భగత్ సింగ్ కలలుకన్నాడు. బ్రిటీష్ పెట్టుబడిదారుల నుండి రాజ్యాధికారం భారతీయ పెట్టుబడిదారులకు మారినంత మాత్రాన ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆయన నమ్మాడు. దోపిడీ వ్యవస్థలన్నీ సమూలంగా అంతమయ్యేంతవరకు స్వాతంత్య్ర పోరాటం కొనసాగాల్సిందేనని ఆయన తన సహచరులకు చెబుతుండేవాడు.
భగత్ సింగ్ ప్రాపంచిక దృక్పథంలో హేతువాదం కీలక అంశంగా నిలిచింది. మతము, మానవ పరిణామం, సమాజ పరిణామం మొదలగు అంశాలను భగత్ శాస్త్రీయంగా విశ్లేషించేవాడు. అన్ని రకాల మూఢాచారాలను తీవ్రంగా నిరసించేవాడు. సమాజంలోని ప్రతీ అంశాన్ని హేతుబద్ధ ఆలోచనా సరళితో విశ్లేషించి అవగతం చేసుకోవాలని యువతకు బోధించేవాడు. స్వాతంత్ర్య సముపార్జన కోసం మిలిటెంట్ గా ఉద్యమిస్తున్న తరుణంలోనే ప్రజల పోరాట శక్తిని బలహీనపరిచే మత రాజకీయాల దుష్ట స్వభావాన్ని భగత్సింగ్ స్పష్టంగా గుర్తించగలిగాడు. మత రాజకీయాలను సమూలంగా వ్యతిరేకించాలని తమ సంస్థ సభ్యులకు నిర్దేశించేవాడు. భగత్ సింగ్ స్థాపించిన యువజన సంఘం 'నౌజవాన్ భారత్సభ'లో మతోన్మాద భావజాలమున్నవారికి ప్రవేశం నిషిద్ధం. మతాన్ని రాజకీయాల నుండి దూరంగా ఉంచాలని, ప్రజల్లో మత సామరస్యం పెంపొందించేలా సభ్యులు కృషి చేయాలని సంఘం నియమావళిలో పొందుపర్చారు. భగత్ సింగ్ మరియు ఇతర విప్లవకారులకు రాజకీయ గురువు లాలా లజపతిరాయ్ మృతికి ప్రతీకారం తీసుకోవడం కోసమే భగత్సింగ్ బృందం చేసిన శాండర్స్ హత్య అంతిమంగా వారి ఉరిశిక్షకు కారణమయింది. అంతగా ఆరాధించిన లజపతిరాయ్.. ఒక దశలో మత రాజకీయాలకు పాల్పడినప్పుడు భగత్సింగ్ తన గురువునే ఎదిరించాడు. సహాయ నిరాకరణ ఉద్యమం ఉపసంహరణ తర్వాత లజపతిరాయ్ క్రమంగా మత రాజకీయాలవైపు మరలిండు. 1924 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసినప్పుడు తమ గురువును, ఆయన మత రాజకీయాలనూ ఓడించాలంటూ భగత్సింగ్, అతని సహచరులు ప్రచారం చేశారు. లాలా లజపత్ రాయ్ అవకాశవాద వైఖరిని ఎండగడుతూ "దారి తప్పిన నాయకుడు" పేరుతో ఒక కరపత్రం విడుదల చేసారు. పత్రికల వాళ్లు ప్రశ్నించినపుడు.. "కానీయనివ్వండి, వారెవ్వరో కాదు.. మేరే నాలాయక్ బేటేహీ హై!" అని సమాధాన మిచ్చాడట లజపత్ రాయ్. మత రాజకీయాలను భగత్సింగ్ ఎంత తీవ్రంగా వ్యతిరేకించాడో.. ఈ సంఘటన రుజువు చేస్తుంది.
మహాత్మాగాంధీ, కాంగ్రెస్ పద్ధతులకు భిన్నంగా కొనసాగిన భగత్సింగ్ విప్లవ కార్యాచరణ నాటి యువతను విశేషంగా ఆకర్షించింది. స్వాతంత్ర సమరయోధుల్లో గాంధీ తర్వాత అంతటి ప్రాచుర్యం భగత్ సింగ్ కే దక్కిందని కాంగ్రెస్ చరిత్ర రాసిన భోగరాజు పట్టాభి సీతారామయ్య ధృవీకరించాడు. జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్లు 'నౌజపాన్ భారత్ సభ' కార్యక్రమాలను కాంగ్రెస్ వేదికపై సమర్థిస్తుండేవారు. మోతిలాల్ నెహ్రూ, పురుషోత్తం దాస్ టాండెన్, షౌకత్ అలీ మొదలయిన వారు భగత్సింగ్ బృందానికి సహకరించేవారు. మహాత్మాగాంధీ మాత్రం తన అహింసా మార్గానికి భిన్నంగా ఉద్యమిస్తున్న భగత్సింగ్ పద్ధతులను తీవ్రంగా వ్యతిరేకించాడు. 'దారితప్పిన యువకులు.. స్వాతంత్ర్య ఉద్యమానికి హాని కలిగించేవారు' అంటూ గాంధీ వీరిని నిందించేవాడు. అయితే.. నాటి కాంగ్రెస్లో సైతం భగత్ సింగ్ కు వ్యతిరేకంగా గాంధీ ప్రతిపాదించే చర్యలకు మద్దతు అంతంతమాత్రంగానే లభించేది. 1929 డిసెంబర్ 23న వైస్రాయి ఇర్విన్ ప్రయాణిస్తున్న రైలును పేల్చి వేయాలని విప్లవకారులు విఫలయత్నం చేశారు. అదే సంవత్సరం డిసెంబర్ 31న జరిగిన కాంగ్రెస్ లాహోర్ సమావేశంలో వైస్రాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ గాంధీ ప్రతిపాదించిన తీర్మానం కేవలం 81 ఓట్ల మెజారిటీతో నెగ్గింది. తీర్మానికి మద్దతుగా 904 ఓట్లు రాగా.. గాంధీ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ, భగత్సింగ్ సహచరుల చర్యలను సమర్థిస్తూ 823 మంది కాంగ్రెస్ ప్రతినిధులు ఓటేశారు.
షహీద్ భగత్సింగ్ కలలుగన్న సమసమాజం ఈ దేశంలో ఇంకా అందనంత దూరంలోనే ఉండిపోయింది. ప్రజల ఐక్యతను చీల్చే మతోన్మాద రాజకీయాలు నేడు విశృంఖలంగా కొనసాగుతున్నాయి. కోట్లాది మంది సామాన్య ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన పాలకులు కొద్దిమంది పెట్టుబడిదారుల సేవలో తరిస్తున్నారు. ఈ గడ్డు పరిస్థితుల నుండి దేశ రాజకీయాలను సక్రమ మార్గంలో పయనింపజేయడానికి.. స్వాతంత్య్రవీరులు కలలుగన్న సమసమాజం నిర్మించడానికి.. షహీద్ భగత్ సింగ్ తాత్విక చింతనను, ఆయన పోరాట వారసత్వాన్ని కొనసాగించడమే సరైన పరిష్కారం.
పైన ఉదహరించిన కీర్తి పత్రిక వ్యాసంలోనే.. "ప్రజల మధ్య అనవసర గొడవలు నిరోధించడానికి.. ప్రజల్లో శ్రామిక వర్గ ఐక్యతను, అసలు సమస్యలపై ఉద్యమించే చైతన్యాన్ని పెంపొందించడం చాలా అవసరం" అని భగత్ సింగ్ స్పష్టీకరించాడు. వలసవాద సంకెళ్లను ఛేదించడం కోసం మతం, కులం మొదలైన విభజనలకు అతీతంగా ప్రజల ఐక్యతను సాధించాలి. కలకత్తా నగరంలో మతఘర్షణలను అడ్డుకోవడానికి.. హిందూ, ముస్లిం వర్గాల కార్మికులు చేతులు కలిపి, మతోన్మాదులను ఐక్యంగా ఎదుర్కొన్న వైనాన్ని ఉదహరించిన ఆయన.. సామాజిక విభజనలను అధిగమించిన శ్రామికవర్గ చైతన్యంతోనే ప్రజల ఐక్యత సాధ్యమని ఆయన తేల్చిచెప్పాడు. గదర్ వీరులు మతాన్ని రాజకీయాల నుండి వేరు చేసి, మతాన్ని వ్యక్తిగత అంశంగా పరిగణించారని.. మతోన్మాద ప్రమాదాన్ని నిలువరించడానికి ఇదే సమర్థవంతమైన పరిష్కారం అని భగత్ సింగ్ పేర్కొన్నారు. మతోన్మాద శక్తుల స్వార్ధ రాజకీయాలను విఫలం చేసి.. ప్రజల ఐక్యతను నిలబెట్టాలనే దృఢ దీక్షతో షహీద్ భగత్ సింగ్ తన జీవితాంతం ఉద్యమించాడు. భారత జాతీయవాదానికి, వలసవాద వ్యతిరేక పోరాటానికి మతతత్వం కలిగించే ప్రమాదాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. "వలసవాదం లాగా మత తత్వం సైతం దేశ ప్రజలకు పెద్ద శత్రువు" అంటూ తన సహచరులకు చెబుతుండేవాడు. మతపరమైన మూఢనమ్మకాల యొక్క మానసిక బానిసత్వం నుండి ప్రజలు విముక్తి పొందడమే నిజమైన స్వాతంత్ర్యమని ఎలుగెత్తి చాటిన ఆ అమరవీరుడి ఆశయాలు నేడు మనకు సరైన తోవను చూపెట్టే దిక్సూచిగా ఉపకరిస్తాయి.
(నేడు షహీద్ భగత్ సింగ్ 116వ జయంతి)
ప్రత్యేక స్టోరీ నేటి నిఘా న్యూస్ మీడియా
ఎడిటర్✍️ కట్టా నరేశ్ కుమార్ నాయక్ (జర్నలిస్ట్)
Comments
Post a Comment