నేటి నిఘా న్యూస్

నేటి నిఘా న్యూస్ తేదీ 02/04/2026.
అవినీతి అక్రమాల పై నీడల వెంటాడే @Netinigha 🗞️📰📺
తేదీ .2, ఏప్రిల్, 2026. ప్రపంచవ్యాప్తంగా, భారత్‌లో మరియు తెలుగు రాష్ట్రాల్లో నేడు చోటుచేసుకున్న చారిత్రక అంశాలు, ప్రభుత్వాల కీలక నిర్ణయాల ప్రత్యేక కథనం ఇది:

1. చరిత్రలో ఈ రోజు (ఏప్రిల్ 2) - ప్రాముఖ్యత ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం: ఆటిజం ఉన్న వ్యక్తుల హక్కుల గురించి అవగాహన కల్పించడానికి ఐక్యరాజ్యసమితి నేడు ప్రపంచ ఆటిజం దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

  • భారత ప్రపంచ కప్ విజయం (2011): సరిగ్గా 15 ఏళ్ల క్రితం (2011) ఇదే రోజున మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీమ్ ఇండియా శ్రీలంకను ఓడించి రెండోసారి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది.  
  • 🏆👍🏆 2011.
  • చాంద్ బేబీ పుట్టినరోజు: మరాఠా వీరవనిత చాంద్ బీబీ 1550లో నేడే జన్మించారు.

2. కేంద్ర ప్రభుత్వం: కీలక నిర్ణయాలు & అమలు

  • కొత్త ఆదాయ పన్ను చట్టం (2025) అమలు: ఏప్రిల్ 1న ప్రారంభమైన కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద నేటి నుండి పన్ను రిటర్న్‌ల దాఖలు ప్రక్రియను సులభతరం చేసే 'వన్‌స్టాప్ డిజిటల్ పోర్టల్' పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది.
  • గ్రీన్ ఎనర్జీ మిషన్: 2030 లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా, నేడు కేంద్రం దేశవ్యాప్తంగా 10 కొత్త గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లకు శంకుస్థాపన చేసింది.

3. ఆంధ్రప్రదేశ్ (AP): నేటి ముఖ్యమైన పనులు & పథకాలు

  • అమరావతి నిర్మాణ పనుల వేగవంతం: ఏకైక రాజధానిగా అమలులోకి వచ్చిన మరుసటి రోజే (నేడు), అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జ్ మరియు అసెంబ్లీ భవన నిర్మాణ పనులకు సంబంధించి ప్రభుత్వం కొత్త టైమ్ లైన్‌ను విడుదల చేసింది.
  • అన్నదాత సుఖీభవ: రైతులకు పెట్టుబడి సాయం కింద అందించే అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలకు సంబంధించి ఈ నెలలో ప్రత్యేక క్యాలెండర్‌ను ప్రభుత్వం ప్రకటించనుంది.
  • ఉచిత ఇసుక విధానం: భవన నిర్మాణ కార్మికులకు ఊరటనిస్తూ, పారదర్శకమైన ఉచిత ఇసుక సరఫరా విధానం నేటి నుండి మరింత కఠినంగా అమలు చేయబడుతోంది.

4. తెలంగాణ (TG): నేటి ముఖ్యమైన పనులు & పథకాలు

  • ఇందిరమ్మ ఇళ్ల మంజూరు: నిన్న ప్రారంభమైన గృహ ప్రవేశాల కొనసాగింపుగా, నేడు కొత్తగా మరో 50,000 ఇందిరమ్మ ఇళ్లకు నిధుల మంజూరు ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది.
  • రుణమాఫీ 3వ విడత క్లియరెన్స్: రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం, పెండింగ్‌లో ఉన్న రుణమాఫీ నిధులను నేటి నుండి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను వ్యవసాయ శాఖ పర్యవేక్షిస్తోంది.

  • గృహజ్యోతి పథకం: నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహజ్యోతి పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి నేటి నుండి స్మార్ట్ మీటర్ల అమరిక ప్రక్రియ మొదలైంది.

5. ప్రపంచ మరియు జాతీయ వార్తలు

  • గూగుల్ మెయిల్ (Gmail) 22వ వార్షికోత్సవం: 2004లో నేడే ప్రారంభమైన గూగుల్ మెయిల్, నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో కూడిన సరికొత్త ఫీచర్లను గ్లోబల్ మార్కెట్లోకి విడుదల చేసింది.
  • భారత్-మలేషియా రక్షణ ఒప్పందం: రక్షణ రంగంలో సహకారం కోసం భారత్ మరియు మలేషియా మధ్య నేడు ఒక కీలక ఒప్పందం కుదిరింది.
ఈ విధంగా ఏప్రిల్ 2వ తేదీ అటు క్రీడా స్ఫూర్తిని, ఇటు అభివృద్ధి పథకాలను మేళవిస్తూ సాగుతోంది.
మీరు ఈ పథకాలకు సంబంధించి దరఖాస్తు విధానం లేదా అర్హత వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ వివరాలు అందించమంటారా?
ప్రతిక్షణం ప్రజలకోసం పనిచేసే న్యూస్ చానల్.
✍️ న్యూస్ ఎడిటర్ శ్రీ కట్టా నరేశ్ కుమార్ నాయక్ 🎤 జర్నలిస్ట్ 📱7097988840.
బ్రేకింగ్ న్యూస్ న్యూస్ NTNS  సౌజన్యం తో 
నేటి నిఘా న్యూస్ 📰

 స్లీపర్‌ బస్సులు మృత్యుశకటాలు
                 -డా. సంకా ప్రసాద్
   విశ్రాంత అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ఆంధ్రప్రదేశ్

కొద్ది నెలలక్రితమే కర్నూలు సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. తాజాగా మార్కాపురం దగ్గర జరిగిన ప్రమాదంలోనూ  పెద్దసంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్, కర్ణాటకలోని చిత్రదుర్గ, దిల్లీలలోనూ ఇటీవల స్లీపర్‌ బస్సులు పెనుప్రమాదాలకు గురయ్యాయి. గడచిన ఆర్నెల్లలో 160 మందికి పైగా ప్రయాణికుల ప్రాణాలను స్లీపర్‌ బస్సులు పొట్టన పెట్టుకున్నాయి. దీంతో ఆ బస్సుల భద్రతా ప్రమాణాలపై సందేహాలు తలెత్తుతున్నాయి.

మన దేశంలో సుమారు 25వేల స్లీపర్‌ బస్సులు నడుస్తున్నట్లు అంచనా. ఇందులో చాలావరకు నిబంధనలకు విరుద్ధంగా పరుగులు తీస్తున్నవే. పెరుగుతున్న ప్రమాదాల నేపథ్యంలో స్లీపర్‌ బస్సులన్నింటినీ కేంద్ర ప్రభుత్వ అధీకృత సంస్థల ద్వారా తనిఖీలు చేయించాలని మొన్న డిసెంబర్‌లో కేంద్రమంత్రి గడ్కరీ ఆదేశించారు. స్లీపర్‌ బస్సు ప్రమాదాల మరణాలపై జాతీయ మానవ హక్కుల సంఘమూ దృష్టి సారించింది. 

అప్పటికే రిజిస్టర్‌ అయి ఉన్న స్లీపర్‌ బస్సులన్నింటినీ వెనక్కి పిలిపించాలని, డ్రైవర్, ప్యాసింజర్‌ల మధ్య అడ్డుగోడ తొలగించాలని, అన్ని బస్సుల్లో నెలలోపు అగ్నిమాపక వ్యవస్థలను అమర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పొడిగించిన బస్సు ఛాసిస్‌లను తొలగించాలని, బాడీ బిల్డింగ్‌కు అధీకృత సంస్థలనే అనుమతించాలని కూడా నిర్దేశించింది. ఈ ఆదేశాల అమలులో చాలా రాష్ట్రాలు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి.

నిబంధనలను గాలికొదిలేసి...
బస్సుల బాడీ నిర్మాణం విషయంలో సరైన పారిశ్రామిక ప్రమాణాలు పాటించకపోవడాన్ని కొంత ఆలస్యంగానైనా గుర్తించిన భారత ప్రభుత్వం ‘ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌(ఏఐఎస్‌)’ పేరిట ప్రమాణాలు రూపొందించింది. ఏఐఎస్‌-052 బస్సుబాడీ డిజైన్, అప్రూవల్‌ పేరిట 2008లో నిబంధనలు తీసుకొచ్చింది. 2014లో వాటిని సవరించింది. ఏఐఎస్‌-119 పేరిట స్లీపర్‌ బస్సులకోసం ప్రత్యేక ప్రమాణాలు జారీ చేసింది. 2024లో నిబంధనలను ఇంకా కఠినతరం చేసింది. బస్సు బాడీ నిర్మాణం చేసే సంస్థలను నియంత్రించేందుకు ఏఐఎస్‌-153ను అమల్లోకి తెచ్చింది.

బస్సులో అగ్నిమాపక వ్యవస్థ ఏఐఎస్‌-135 ప్రకారం ఉండాలనే నిబంధనను రూపొందించింది. చట్టాలు, నిబంధనలు, ప్రమాణాలు ఎన్ని ఉన్నా- బస్సు యజమానుల్లో నిర్లక్ష్యం, కొంతమంది అధికారుల్లో నిజాయతీ లేకపోవడం సమస్యాత్మకమవుతోంది. 

నిబంధనలు పట్టించుకోకుండా, విచ్చలవిడిగా తిరుగుతున్న స్లీపర్‌ బస్సులు ప్రయాణికుల భద్రతకు ముప్పుగా మారాయి. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి తనిఖీలు తప్పితే... వాహన నిర్మాణం, సీట్ల అమరిక, అత్యవసర ద్వారం, అగ్నిమాపక వ్యవస్థ వంటి విషయాలపై నిరంతర తనిఖీలు కొరవడుతున్నాయి.

ఏఐఎస్‌-052 ప్రమాణాల ప్రకారం, బస్సులో ఒకవైపు సింగిల్‌ బెర్తు, ఇంకొకవైపు డబుల్‌ బెర్తు ఉండేలా మొత్తం ముప్పైఆరు బెర్తుల నిర్మాణానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. కొన్ని సీట్లు, కొన్ని బెర్తులు ఉండేలా అనుమతించింది. దీంతో బెర్తుల మధ్య నడవా తగ్గింది. డబుల్‌ బెర్తువల్ల అపరిచితుల పక్కన పడుకోవాల్సి వస్తోంది. నిద్రలో ఉండే ప్రయాణికులు అత్యవసర సమయాల్లో బయట పడటానికి సమయం పడుతోంది. డబుల్‌ బెర్తులోని రెండో వ్యక్తి బయటికి రావడం చాలా కష్టమవుతోంది. 

పై బెర్తు విషయంలో ఇది మరింత ఇబ్బందిగా ఉంటోంది. అత్యవసర ద్వారానికి అడ్డంగా బెర్తులు అమర్చుతున్నారు. అదీగాక నిప్పు అంటుకున్న నిమిషాల వ్యవధిలోనే బస్సు బుగ్గిగా మారుతోంది. బాడీ నిర్మాణంలో వాడే పదార్థాలు అగ్ని నిరోధక లక్షణాలు కలిగి ఉండాలనే ఏఐఎస్‌-135 నిబంధనలకు తూట్లు పొడుస్తున్నట్లు దీంతో అర్థమవుతోంది.

మోటార్‌ వాహన చట్టం ప్రకారం- బస్సు డ్రైవర్, సహాయకులు ప్రమాద సమయాల్లో ప్రయాణికుల రక్షణకు తోడ్పడాలి. వారు తప్పించుకోవడం, ఇతరులూ సరిగ్గా స్పందించకపోవడం బాధ్యతారాహిత్యమే. రహదారి ప్రమాదాల్లో క్షతగాత్రులకు సాయం చేసేవారిని ప్రోత్సహించేలా రూ.25వేలదాకా పారితోషికం, ప్రశంసాపత్రం ఇచ్చేలా కేంద్రం‘రాహ్‌వీర్‌ పథకాన్ని’ తీసుకొచ్చింది. 

దీనిపై సరైన ప్రచారం, అవగాహన లోపిస్తున్నాయి. గతంలో ఏ రాష్ట్రంలో రిజిస్టర్‌ అయిన కాంట్రాక్ట్‌ క్యారేజీలు ఆ రాష్ట్రంలోనే ప్రయాణం మొదలుపెట్టాలని, ఎన్ని రాష్ట్రాలు తిరిగినా అక్కడికే చేరాలనే నిబంధన ఉండేది. జాతీయ స్థాయిలో ప్రయాణికుల రవాణాను సులభతరం చేయాలనే ఉద్దేశంతో ఈ నిబంధనను తొలగించారు. దాంతో బస్సుల యజమానుల్లో చాలామంది పన్నులు తక్కువగా ఉండే ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వాహనాలు రిజిస్టర్‌ చేసుకుని ఇతర ప్రాంతాల్లో తిప్పుతున్నారు. ఇలాంటి బస్సులపై నిరంతర నియంత్రణ కష్టతరంగా మారింది. 

కఠిన చర్యలు తీసుకుంటేనే...
దక్షిణ అమెరికా, యూరప్‌ దేశాల్లో స్లీపర్‌ బస్సులు తక్కువగా కనిపిస్తాయి. జర్మనీ, స్వీడన్, డెన్మార్క్‌ వంటి దేశాలైతే పూర్తి వాలుబెర్తులతో ఉండే స్లీపర్‌ బస్సులను నిషేధించాయి. తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో చైనా ప్రభుత్వం స్లీపర్‌ బస్సుల తయారీని నిలిపివేసింది.

 ఇంగ్లాండ్‌లో రోజువారీ ప్రయాణాలకు స్లీపర్‌ బస్సులను వాడే విధానం లేదు. వియత్నాం, లావోస్, కంబోడియా వంటి దేశాల్లో స్లీపర్‌ బస్సులు ఉన్నా, డబుల్‌ బెడ్‌ లేదు. చైనా తరహాలో భారత్‌లోనూ ప్రయాణికుల భద్రత దృష్ట్యా స్లీపర్‌ బస్సులను నిలిపేసే అవకాశాలను పరిశీలించాలి. బస్సుల్లో అత్యవసర ద్వారం, అగ్నిమాపక యంత్రాలు తప్పక ఉండాలి.

అవసరమైనప్పుడు అద్దాలు పగులగొట్టి బయటకు రావడానికి ఇనుప సుత్తులను అందుబాటులో ఉంచాలి. బస్సు తిరగబడితే బయటికొచ్చే వీలుండాలి. ఇలాంటి నిబంధనలను యజమానులందరూ పాటించేలా చూడాలి. బస్సుల్లో ప్రమాదకరమైన వస్తువుల రవాణాను ఆపించేయాలి. 

అగ్నిమాపక వ్యవస్థ, అత్యవసర ద్వారాలు, ఆన్‌లైన్‌ సమాచార వ్యవస్థ పనితీరును ముందుగానే తనిఖీ చేయాలి. సంబంధిత సమాచారాన్ని ప్రయాణికులకూ తెలపాలి. బస్సు వేగం లోపలి ప్రయాణికులకు తెలిసేలా డిస్‌ప్లే ఉండాలి. నిబంధనలు ఉల్లంఘించి బస్సులను నడిపేవారిపై, అందుకు అనుమతించిన అధికారులపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలి. ప్రయాణికులు సైతం వేగం, సౌకర్యంకన్నా భద్రతకే ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే రహదారి ప్రమాదాలు, మరణాలు తగ్గుతాయి.

 ఎరుపెక్కిన చరిత్రలో చివరి అధ్యాయం!
               -వలసాల వీరభద్రం 
సమసమాజ స్థాపన పేరుతో ఆరు దశాబ్దాలపాటు సాగిన నక్సల్‌ పోరాటం సాధించిందేంటి? బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లులు, సహచరులను కోల్పోయిన భార్యలూ భర్తలు, తల్లిదండ్రులకు దూరమైన పిల్లల కన్నీటి పొరల మధ్య విప్లవోద్యమ ఫలితాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. మరణశిక్ష నుంచి మినహాయింపు పొందేందుకు లొంగుబాటు అనే చివరి వరాన్ని ప్రసాదిస్తున్నామంటూ కేంద్రం విధించిన మార్చి 31 గడువు ముగిసిపోయింది. ఇకమీదట దేశంలో కనుమరుగయ్యేది నక్సలైట్లా, నక్సలిజమా అన్నది భవిష్యత్తే నిర్ణయిస్తుంది!  

పశ్చిమ్‌ బెంగాల్‌లో 1967లో పుట్టిన వామపక్ష తీవ్రవాదం శ్రీకాకుళం రైతాంగ పోరాటం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించింది. ఇక్కడ బలపడిన నక్సలిజం క్రమంగా పలు రాష్ట్రాలకు విస్తరించింది. ఒకదశలో ఇటు శ్రీలంకలోని ఎల్టీటీఈ, అటు నేపాల్‌లోని ప్రచండ వర్గంతో చెయ్యి కలిపి రెడ్‌కారిడార్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం ప్రభుత్వం గుండెల్లో అలజడి రేపింది. 

అప్పట్లో అట్టడుగు వర్గాలను పీడిస్తున్న భూస్వామ్య వ్యవస్థ, సామాజిక ఆర్థిక వెనకబాటుతనాల వల్లే వామపక్ష తీవ్రవాదం బలపడింది. బలవంతుల దాష్టీకాలకు బాధితులైన వారంతా నక్సలైట్లను అక్కున చేర్చుకుని అజ్ఞాత పోరాటానికి భుజం కలిపారు. విద్యార్థులూ మేధావులు కూడా వారితో కలిసి కదంతొక్కారు. మూలకారణాలను వదిలేసి విప్లవోద్యమాన్ని కర్కశంగా అణచివేయడమే ఏకైక పరిష్కార మార్గమని అప్పటి ప్రభుత్వాలు అనుకోవడంతో నక్సలిజం మరింత బలం పుంజుకుంది. 

ఆత్మపరిశీలనతో మొదలైన మార్పు
నిన్నమొన్నటి వరకూ ఉద్యమాన్ని ముందుండి నడిపినవారిలో పలువురు ఉన్నతవిద్యావంతులే కాదు, బహుముఖ ప్రజ్ఞాశీలురు కూడా. లక్ష్యసాధన కోసం వారు ఎంచుకున్న మార్గం ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకు విరుద్ధమనే అభిప్రాయం ఉన్నప్పటికీ సిద్ధాంతపరమైన స్పష్టత కారణంగా ఉద్యమం ప్రజల్లోకి వెళ్లింది. ఒకదశలో ఉత్తర తెలంగాణలో నక్సలైట్లు సమాంతర ప్రభుత్వం నడిపారు. బహిరంగ న్యాయవిచారణలూ శిక్షలను అమలు చేసి అణగారిన వర్గాలకు తక్షణ న్యాయం అందుతుందనే నమ్మకం కలిగించే ప్రయత్నం చేశారు. భూస్వాముల భూముల్లో ఎర్రజెండాలు పాతి, వాటిని పేదలకు పంచిపెట్టారు.

నక్సలైట్ల చేతల్లో న్యాయాన్యాయాల సంగతి పక్కనపెడితే, పస్తులుంటున్న బీదాబిక్కీ జనం మాత్రం ‘అన్నల’వల్ల తమకు మేలు జరిగిందనే భావించారు. ప్రజలు అలా ఎందుకు అనుకుంటున్నారో అర్థంచేసుకోని నాటి ప్రభుత్వాలు నక్సలైట్లనే కాదు, భయంతోనో భక్తితోనో వారికి అన్నం పెట్టిన వారినీ హింసించడం మొదలుపెట్టాయి. ఇందుకు భూస్వాములు, పెట్టుబడిదారులు వంతపాడటంతో సమాజంలో చీలిక స్పష్టంగా కనిపించింది. గ్రామాల్లో బాధిత వర్గాలు అన్నలకు ఇంకా దగ్గరయ్యాయి. నక్సలిజాన్ని శాంతిభద్రతల సమస్యగా చూసినంతకాలం పరిస్థితి ఇలాగే కొనసాగింది. 

ప్రభుత్వాలు ఆత్మపరిశీలన మొదలుపెట్టి నక్సలిజాన్ని సామాజిక ఆర్థిక సమస్యగా గుర్తించిన తరవాత సర్కారీ పోరాట పంథా మారింది. ఎర్రచొక్కా వేసుకున్న వారందరినీ నక్సలైట్లుగానే భావించి చిత్రహింసలు పెట్టే దశ నుంచి అలాంటి భావజాలం ఉన్నవారిని గుర్తించి కౌన్సెలింగ్‌ చేయడం, లొంగుబాట్లను ప్రోత్సహించడం ఆరంభమైంది.

 ప్రజాసమస్యలను పరిష్కరించడం ద్వారా జనం మనసులను గెలుచుకోవాలన్న ఆలోచన మొదలైంది. ఉమ్మడి ఏపీలో ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమం కళ్లముందే చల్లారడానికి గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీల పోరాట పటిమే కాదు, ఇలాంటి సంక్షేమ చర్యలూ కారణమయ్యాయి. ఇక ఇక్కడ చోటులేదని గ్రహించిన నక్సలైట్లు ఎప్పుడో సిద్ధం చేసిపెట్టుకున్న దండకారణ్య స్థావరానికి తరలిపోయారు. ఆపరేషన్‌ కగార్‌ పేరిట ప్రభుత్వం ప్రయోగించిన ఆఖరి అస్త్రంతో అక్కడా వారు చెల్లాచెదురయ్యారు.

అరవై ఏళ్ల పోరాటం తరవాత... 
నక్సలిజం వల్ల ప్రభావిత 12 రాష్ట్రాల్లో 20వేల మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పార్లమెంటులో ప్రకటించారు. నక్సలిజాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లోనే రూ.3610 కోట్లు, పోలీసు బలగాల ఆధునికీకరణకు రూ.4061 కోట్లు కేటాయించింది. 

ఇతరత్రా పథకాల కింద కేంద్రం ప్రత్యేకించిన మొత్తం రూ.పదివేల కోట్ల వరకూ ఉంటుంది. ఇవన్నీ ఒక సంవత్సర కేటాయింపులే! ఇది కాకుండా కగార్‌ పేరుతో దాదాపు 50వేల మంది కేంద్ర బలగాలతో చేపట్టిన గాలింపులకు అయిన ఖర్చుకు లెక్కేలేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నక్సలైట్ల ఏరివేత పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చుచేశాయి.

మరోవైపు- నక్సలిజం విస్తరణకు వెనుకబాటుతనమే కారణమని గుర్తించిన ప్రభుత్వాలు ఆమేరకు దిద్దుబాటు చర్యలు తీసుకున్నాయి. కేంద్రం లెక్కల ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకూ నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో 12వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేశారు. ఆదివాసీలను మిగిలిన ప్రపంచంతో అనుసంధానించేందుకు రూ.6వేల కోట్లతో 5వేల మొబైల్‌ టవర్లు నిర్మించారు. గడచిన పన్నెండేళ్లలో బాధిత ప్రాంతాల్లో 259 ఏకలవ్య గురుకుల పాఠశాలలు, 46 ఐటీఐలు, 49 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలు తెరిచారు. వెనకబడిన ప్రాంతాలకు నక్సలైట్ల వల్ల పరోక్షంగానైనా దక్కిన లబ్ధి ఇది!

సుదీర్ఘ పోరాటంలో రాలిపోయిన, లొంగిపోయిన, అరెస్టయిన నక్సలైట్లు, దాంతో తగ్గిపోయిన హింసాత్మక ఘటనల గురించి ప్రస్తావిస్తున్న కేంద్రం- దేశంలో వామపక్ష తీవ్రవాదం ఇక ముగిసిపోయిందని నమ్ముతోంది. నక్సల్‌ ప్రభావిత జిల్లాల సంఖ్య కూడా ఇప్పుడు రెండుకు పరిమితమైంది. మారుతున్న పరిస్థితులను పట్టించుకోకుండా పిడివాదంతో పోరాటాన్ని కొనసాగించడమే నక్సలైట్లకు శరాఘాతమైందన్న విమర్శలున్నాయి. సాంకేతిక విప్లవ ఫలితాలు కూడా ఉద్యమాన్ని దెబ్బతీశాయి.

ఇదే సమయంలో అందివచ్చిన అత్యాధునిక ఆయుధ సంపత్తి భద్రతా బలగాల సత్తాను పెంచింది. మొత్తమ్మీద కేంద్రానిదే పైచేయి అని స్పష్టమవుతోంది. అంతమాత్రాన నక్సలైట్‌ ఉద్యమం ఏమీ సాధించలేదని చెప్పలేం. నక్సలైట్లతో విభేదించేవారు సైతం వారు లేవనెత్తిన అంశాలను నిరాకరించలేరు. సంఖ్యాపరంగా నక్సలైట్లు కనుమరుగు కావచ్చు. 

కానీ- వెనకబాటుతనం, వివక్ష వంటివి ఇంకా ఎక్కువగానే ఉన్న సమాజంలో ప్రజల మనసుల నుంచి నక్సలిజం తాలూకు భావజాలాన్ని తుడిపేయడం అంత తేలిక కాదు. విప్లవోద్యమ జ్వాలలను రాజేసిన సామాజిక సమస్యలను సంపూర్ణంగా పరిష్కరించడంపై ప్రభుత్వాలు దృష్టిసారిస్తేనే నిజమైన ఫలితం దక్కుతుంది. నక్సలైట్లు ఆశించిన లక్ష్యమూ నెరవేరుతుంది. ఈ పోరాటంలో ఇరుపక్షాల నుంచి అమరులైన వారికి అదే సరైన నివాళి అవుతుంది!

 అగ్రరాజ్యానికి ఆయుధమే ఆహారం యుద్ధమే పెట్టుబడి
                       -విశ్వజంపాల

ప్రపంచపటంలో తననుతాను ‘ప్రజాస్వామ్య రక్షకురాలు’గా, ‘శాంతి కాపలాదారు’గా చిత్రించుకునే అమెరికా అసలు రంగు యుద్ధం. అమెరికాకు ఆయుధమే ఆహారం, యుద్ధమే పెట్టుబడి. ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ చమురుతో కాదు, ఇతర దేశాల్లో చిందే రక్తంపై, ఆయుధాల అమ్మకాలపై ఆధారపడి నడుస్తోంది. శాంతిమంత్రం పైకి జపిస్తూనే, లోపల యుద్ధతంత్రాన్ని నడిపే అమెరికా వైఖరి మానవజాతికే ఒక కళంకం.‘అమెరికా ఆయుధాలు తింటోంది’ అనేది నేడు ఒక చేదు నిజం. 

అంటే.. అది కేవలం లోహపు ముక్కలను మింగడం కాదు; కోట్లాదిమంది అమాయకుల కలలను, పసిపిల్లల భవిష్యత్‌ను, స్వతంత్ర దేశాల సార్వభౌమత్వాన్ని పచ్చిగా నమిలి మింగుతోందని అర్థం. అమెరికాకు శాంతి అంటే ఒక నినాదం మాత్రమే. కానీ యుద్ధం అంటే ఒక భారీ లాభదాయకమైన వ్యాపారం.ప్రపంచ దేశాల మధ్య చిచ్చు పెట్టడం, ఆ మంటల్లో తన ఆయుధాల ఫ్యాక్టరీలను వేడి చేసుకోవడం ఆ దేశానికి వెన్నతో పెట్టిన విద్య. ఒక దేశంపై బాంబులు కురిపించాలన్నా, మరో దేశపు సార్వభౌమత్వాన్ని కాలరాయాలన్నా అమెరికాకు కావాల్సింది ‘ప్రజాస్వామ్య రక్షణ’ అనే ఒక అబద్ధపు సాకు. ఆ దేశపు క్షిపణులపై రాసి ఉండేది శాంతి సందేశం కాదు, రాబోయే వినాశనం తాలూకు ధర. ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, అది అమెరికా స్టాక్ మార్కెట్‌కు పండగే. శ్మశానాల మీద సౌధాలు నిర్మించుకునే వికృత ఆర్థిక వ్యవస్థ అమెరికాది.
డాలర్ విలువ పెరగాలంటే మరో దేశం రణరంగం కావాల్సిందే. మధ్య ప్రాచ్యం నుంచి ఐరోపా వరకు అమెరికా వేసిన ప్రతి అడుగు వెనుక చమురు వేట, ఆయుధాల అమ్మకం తప్ప మానవత్వం ఎక్కడా కనిపించదు. మందుగుండు సామాగ్రిని అమ్మడం కోసం శత్రువులను సృష్టించడం, ఆపై మధ్యవర్తిగా నటిస్తూ ఇరుపక్షాల రక్తాన్ని పీల్చడం - ఇదే వాషింగ్టన్ అనుసరిస్తున్న అసలైన ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’.అమెరికా ఆర్థిక వ్యవస్థకు యుద్ధం అనేది ఒక ‘లైఫ్ సపోర్ట్’ లాంటిది; అది ఆగిపోతే ఆ దేశపు జిడిపి వెంటిలేటర్ మీదకు వెళ్తుంది. 

లాక్ హీడ్ మార్టిన్, బోయింగ్, రేథియాన్ వంటి సంస్థల షేర్లు పెరగాలంటే, మరో దేశంలో పసిపిల్లల హాహాకారాలు వినిపించాలి. శత్రువు లేకపోతే అమెరికా మనుగడ లేదు. అందుకే ఒకవేళ ప్రపంచంలో శత్రువు లేకపోతే, తన ఆయుధాలు అమ్ముకోవడం కోసం ఒక కొత్త శత్రువును తానే సృష్టించి, అతడిని ప్రపంచానికి విలన్‌గా పరిచయం చేస్తుంది.

అమెరికా నేరుగా యుద్ధ రంగంలోకి దిగదు, కానీ యుద్ధం ఆగిపోనివ్వదు. దీనినే ఆ దేశం ‘ప్రాక్సీ వార్’ అని పిలుచుకుంటుంది. రష్యాను దెబ్బకొట్టడానికి ఉక్రెయిన్‌ను ఒక పావుగా వాడుకుంటూ, వేలకోట్ల విలువైన ఆయుధాలను సరఫరా చేస్తోంది. దీనివల్ల ఉక్రెయిన్ నాశనమవుతున్నా, అమెరికా ఆయుధ కంపెనీల లాభాలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. అమెరికా తన యుద్ధోన్మాదంతో ప్రపంచదేశాలపై రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, సాయుధ, సాంకేతిక అణచివేతలకు పాల్పడుతుంది.
సుమారు 800 బిలియన్ డాలర్లకు పైగా రక్షణ బడ్జెట్‌తో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద సైనికశక్తిగా ఉంది. ఇది మిగతా టాప్ 10 దేశాల బడ్జెట్ కంటే ఎక్కువ. ప్రపంచ ఆయుధ ఎగుమతుల్లో సుమారు 40% వాటా అమెరికాదే. అభివృద్ధి చెందుతున్న దేశాలు సొంతంగా రక్షణ రంగంలో ఎదగకుండా ఆంక్షలు విధిస్తూ, ప్రపంచ దేశాలన్నీ సాంకేతికత కోసం తనపైనే ఆధారపడేలా చేసుకుంటుంది.

ఒకసారి అమెరికా ఆయుధాన్ని కొంటే, ఆ దేశం ఇక దశాబ్దాల పాటు అమెరికాకు బానిసగా ఉండాల్సిందే. ఇది రక్షణ ఒప్పందం కాదు, ఒక దేశంపై రుద్దే ‘డిజిటల్, మిలిటరీ బానిసత్వం’. ప్రపంచ శాంతిని కాపాడాల్సిన ఐక్యరాజ్యసమితి, నేడు అమెరికా చేతిలో ఒక కీలుబొమ్మగా మారిపోయింది. తన ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ తీర్మానాన్ని అయినా అమెరికా తన ‘వీటో’ అధికారంతో తొక్కిపెడుతుంది. 

అణ్వాయుధ రాజకీయంలో అమెరికాది అందెవేసిన చెయ్యి. ‘తుపాకీ గొట్టంద్వారా వచ్చే శాంతి శ్మశాన శాంతి మాత్రమే. అది ఎప్పటికీ శాశ్వతం కాదు. ‘దీన్ని అగ్రరాజ్యాలైన అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, చైనా తోపాటు ప్రపంచ దేశాలన్నీ గుర్తుంచుకోవాలి. శాంతి అనేది బాంబుల మోత ఆగినప్పుడు వచ్చే నిశ్శబ్దం కాదు.. అది ప్రతి మనిషి భయం లేకుండా బతికే స్వేచ్ఛ. అధికారం కంటే మానవత్వం, ఆయుధాల కంటే సహజీవనం గొప్పవని ప్రపంచ దేశాలు గుర్తించి, అమెరికా సృష్టిస్తున్న ఆయుధ విషవలయం నుండి, ‘సాంకేతిక బానిసత్వం’ నుండి బయటపడినప్పుడే భూమిపై నిజమైన శాంతి వెల్లివిరుస్తుంది. ఆయుధాలు లేని ప్రపంచమే రేపటి తరానికి మనం ఇచ్చే అతిపెద్ద ఆస్తి!


Comments

Popular posts from this blog

నేటి నిఘా న్యూస్ తేదీ:30/03/2026

సావిత్రి బాయ్ పూలే జన్మదిన వేడుకలు

నేటి నిఘా న్యూస్ 23/04/2026